శేరిలింగంపల్లి, జనవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలోని ప్రతి జర్నలిస్ట్ కి న్యాయం జరగాలని , రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు, చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా అంటూ వేరు చేయడం తగదని, జీవో 252 ని పునఃసమీక్షించాలని, అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని, ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ జర్నలిస్టులకు అందాలని తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సుందర్ కల్లూరి డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ ల జోలికి వస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. జర్నలిస్టులకు ఏదైనా ఇబ్బంది కలిగితే తమ దృష్టికి తీసుకొస్తే తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం బాధితుల దగ్గరికి వచ్చి వారికి కొండంత అండగా ఉంటుందని జర్నలిస్టులందరికీ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యక్షుడు సుందర్ కల్లూరి, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కీర్తిసంతోష్ రాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






