శేరిలింగంపల్లి, జనవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ బొల్లారం చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ట్రాఫిక్ సిఐ ప్రశాంత్, GHMC అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని బొల్లారం దారిలో నిత్యం నెలకొంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేలా తగు మార్పులు చేర్పులు చేయాలని వాహనదారులకు అవస్థలు తగ్గించాలన్నారు. మియాపూర్ చౌరస్తా నుంచి బొల్లారం చౌరస్తా లో జిహెచ్ఎంసి అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి కార్పొరేటర్ శ్రీకాంత్ పర్యటించారు. మూల మలుపులు, డివైడర్లు, యూటర్న్‌లు సహా పలు అంశాలను ఆయన పరిశీలించారు. నియోజకవర్గాలకు వారధిగా బొల్లారం రోడ్ అతి కీలకంగా మారిందని, నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని, ట్రాఫిక్ సమస్య వల్ల ఉదయం సాయంత్రం సమయాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. ట్రాఫిక్ స్తంబించకుండా చేపట్టాల్సిన చర్యలను తీసుకోవాలని, ఎప్పటికపుడు ట్రాఫిక్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కార్పొరేటర్ శ్రీకాంత్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు DE శ్రీదేవి, AE ప్రశాంత్, సీనియర్ నాయకులు బండారు మోహన్ ముదిరాజ్, నరేష్, వెంకటేష్, శివ ముదిరాజ్, వర్క్ఇన్స్పెక్టర్లు అన్వర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.






