శేరిలింగంపల్లి, జూలై 31 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, అల్లావుద్దీన్ పటేల్, మిద్దెల మల్లారెడ్డి, పొట్ట నరేందర్ యాదవ్, విజయ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి, జనార్దన్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలోని ప్రమాదకర నాలాలో పడి గల్లంతైన వృద్ధుడు బాలయ్య (70) ఆచూకీ నాలుగు రోజులైనా లభించకపోవడం ప్రభుత్వ యంత్రాంగం ఘోర వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రతి వర్షాకాలంలో నియోజకవర్గ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, నాలాలు, మ్యాన్‌హోళ్ల వద్ద కనీస భద్రతా చర్యలు లేకపోవడం వల్లే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా ప్రజాప్రతినిధులు, అధికారులు గుణపాఠం నేర్చుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

బాలయ్య గల్లంతైన ఘటన తర్వాత జీహెచ్‌ఎంసీ, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, నాలుగు రోజులైనా ఆచూకీ కనుగొనలేకపోవడం అధికార యంత్రాంగం వైఫల్యమేనని విమర్శించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ఒక వ్యక్తిని గుర్తించలేని పరిస్థితి సిగ్గుచేటని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడల్లా నాలాల వద్ద రైలింగ్‌లు ఏర్పాటు చేస్తామని, శాశ్వత భద్రతా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చే ప్రజాప్రతినిధులు ఆచరణలో విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. ప్రమాదాలు జరిగిన తర్వాత పరామర్శలు, ఫొటోలకు పరిమితమయ్యే సంస్కృతికి స్వస్తి పలకాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు నిద్రమత్తు వీడి బాలయ్య ఆచూకీని తక్షణమే కనుగొని, బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో నాలాలు, మ్యాన్‌హోళ్ల కారణంగా మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా కట్టుదిట్టమైన శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.డీ. సలీం, శ్రీనివాస్ రెడ్డి, రాములు, చారి, చందర్ రావు, శబానా, అంజి యాదవ్, అనంత రెడ్డి, రాజశేఖర్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.





