శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రుల నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ తో జగదీశ్వర్ గౌడ్ సమావేశమై శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై, విద్యుత్ దీపాల నిర్వహణ కొత్త లైట్ ల ఏర్పాటుపై, ముఖంగా హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మంజీరా పైప్ లైన్ రోడ్డు పనులపై సమీక్ష నిర్వహించారు.
పనులను వేగవంతం చేయడం, సకాలంలో పూర్తి చేయడం, వీధి దీపాల సమస్యలను పరిష్కరించడం వంటి కీలక అంశాలను కూడా సమావేశంలో ప్రస్తావించారు. గ్రేటర్ హైదరాబాద్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కమీషనర్, స్టాండింగ్ కమిటీ దృష్టికి ఈ విషయాలను చర్చించాలని కూడా ప్రణాళిక వేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ కేడర్, బృందం కొనసాగుతున్న పనులను పర్యవేక్షిస్తూ, నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి పని చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అభిషేక్ గౌడ్, ఎలక్ట్రికల్ ఎఈ మమత తదితరులు ఉన్నారు.