చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న షిరిడిసాయి, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఆలయ 9వ వార్షికోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి నిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. 27వ తేదీన రాత్రి 7 గంటలకు సహస్ర అవధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావుచే దివ్య ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే 28వ తేదీన ఉదయం 10 గంటలకు చండీ హోమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీర్వచనాలు పొందాలని ఆలయ ఫౌండర్, చైర్మన్ యు.వి.రమణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.