శేరిలింగంపల్లి, మే 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని టి.సి.సి క్లబ్‌లో విజయ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ CMD దాసరి జై రమేష్ 80వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విజయ్ ఎలక్ట్రికల్స్ పూర్వ కార్మికుడు, ఉద్యోగుడు సాంబమూర్తి ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లిఖార్జున, కార్మిక నాయకుడు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన దాసరి జై రమేష్ సేవలు అభినందనీయమన్నారు. ఆయన 80వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 40 మంది రక్తదానం చేయడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్న గాంధీ, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసే వారు దేవుళ్లతో సమానమని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడుతుందని అన్నారు.

ప్రస్తుతం ఆరోగ్యం వ్యాపారంగా మారుతున్న పరిస్థితుల్లో సామాజిక బాధ్యతతో ఉచిత వైద్య, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య సేవలు, మందుల పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని తెలిపారు. మానవతా దృక్పథంతో నాణ్యమైన వైద్యాన్ని పేదల వద్దకు తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని వెల్లడించారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో విజయ్ ఎలక్ట్రికల్స్ పూర్వ ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





