మాదాపూర్ భూవివాదం కలకలం.. వైఎస్ షర్మిల పేరు చెప్పి బెదిరిస్తున్నారు.. బాధితుడు నర్సింగ్ రావు ఆరోపణలు..

శేరిలింగంప‌ల్లి, మే 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తనకు చెందిన స్థలాన్ని కొందరు వ్యక్తులు రాజకీయ అండదండలతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు పల్లెపు నర్సింగ్ రావు ఆరోపించారు. వైఎస్ షర్మిల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని, స్థలంలోకి చొరబడి కాంపౌండ్ వాల్‌తోపాటు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని ఆయన మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగ్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని 1996 సొసైటీకి చెందిన జీపీఏ హోల్డర్ వద్ద నుంచి 1996లోనే మొత్తం 1200 గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో 600 గజాలు పల్లెపు పుష్పలత పేరుపై, మరో 600 గజాలు చంద్రకళ పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయని చెప్పారు. అనంతరం ఈ భూమిని డెవలప్‌మెంట్ కోసం సత్యనారాయణ రెడ్డి అనే బిల్డర్‌కు అప్పగించినట్లు వెల్లడించారు.

ఈ స్థలానికి సంబంధించి 2008లోనే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయిందని, గతంలో దేవాదాయ శాఖ క్లెయిమ్ చేసినప్పటికీ ప్రభుత్వం మిగులు భూమిగా గుర్తించి 1200 గజాలను క్రమబద్ధీకరించి ఇచ్చిందని నర్సింగ్ రావు పేర్కొన్నారు. గతంలో ఈ స్థలాన్ని 15 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చినట్లు, తమ డ్రైవర్ కూడా అక్కడే నివాసం ఉన్నట్లు తెలిపారు. కరెంట్ బిల్లులు సహా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ స్థలానికి ఉత్తర దిశలో 40 అడుగుల రోడ్డు, తూర్పు దిశలో 30 అడుగుల రోడ్డు సౌకర్యం ఉందని వివరించారు. గతేడాది నుంచి రామారావు అనే వ్యక్తి వచ్చి ఈ స్థలంలో తన హక్కు ఉందంటూ వివాదం సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కరీంనగర్‌కు చెందిన సురేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని పేర్కొన్నారు. అండర్ గ్రౌండ్‌లో ఉండే సత్యం అనే వ్యక్తి ముఠాతో కలిసి సురేందర్ రెడ్డి తనను నేరుగా బెదిరించాడని ఆరోపించారు.

తాజాగా శుక్ర‌వారం కొందరు వ్యక్తులు స్థలంలోకి చొరబడి కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసి, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని నర్సింగ్ రావు తెలిపారు. అంతేకాకుండా వైఎస్ షర్మిల పేరుతో బోర్డు ఏర్పాటు చేసి, తనను షర్మిల కార్యాలయానికి రావాలని హెచ్చరిస్తున్నారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి కలిసి తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, భూమికి సంబంధించిన జీపీఏ పత్రాలు, ప్రభుత్వ రికార్డులు అన్నీ తమ వద్ద ఉన్నాయని నర్సింగ్ రావు స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టులో పోరాడేందుకు సిద్ధమని, న్యాయం తమవైపే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here