పేదల సంక్షేమమే లక్ష్యం.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పథకాలు అందిస్తాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొంగర కలాన్‌లోని రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్) సమావేశ మందిరంలో నిర్వహించిన 99 రోజుల కార్యాచరణ – ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

పేదవారి కల అయిన ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని, ప్రజలపై భారం పడకుండా నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తాము పాలకులం కాద‌ని, ప్రజల సేవకులం అన్న భావనతో ప్రజల అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని గాంధీ తెలిపారు. ప్రభుత్వ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. మార్చి 6 నుంచి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని సూచించారు. గ్రామాలు, వాడల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పరిపాలనలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులందరికీ చేరేలా చూడటం అందరి బాధ్యత అని అన్నారు. తెలంగాణ రైజింగ్ – 2047 విజన్‌తో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. CURE, PURE, RARE విధానాలతో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాలని పేర్కొన్నారు. ఈ 99 రోజుల కార్యాచరణ సాధారణ కార్యక్రమం కాదని, ఇది తెలంగాణ అభివృద్ధికి ఒక దీక్ష అని గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం మినీ ఇండియాగా ఎదిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళల సాధికారత కోసం ఎల్లమ్మబండలో మహిళల పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మహిళా భవనం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామని, రోడ్ల విస్తరణతోపాటు అన్ని మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here