శేరిలింంగపల్లి, జూన్ 9 (నమస్తే శేరిలింంగపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని వీడియో కాలనీ, ఎఫ్సీఐ కాలనీల్లో కొనసాగుతున్న నాలా పనులపై స్థానికుల ఆందోళనల నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ సంబంధిత అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. కాలనీవాసుల అభ్యర్థన మేరకు నిర్వహించిన ఈ పర్యటనలో ఎస్ఎన్డీపీ, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి నాలా పనుల పురోగతి, ప్రతిపాదిత మార్పులను పరిశీలించారు. ప్రస్తుతం చేపడుతున్న పనుల వల్ల భవిష్యత్తులో వరదలు, మురుగునీటి పారుదల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న నాలాను విస్తరించి పునరుద్ధరణ పనులు చేపట్టాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాలా సమస్యపై అధికారులు పునరాలోచన చేసి ప్రజలకు అనుకూలంగా పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచే విధంగా ఎలాంటి పనులు చేపట్టకూడదని ఆయన స్పష్టం చేశారు.

రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు కమిషన్లు లేదా అనుకూల వర్గాల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. 2023లో నాలా పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ, ప్రస్తుతం ప్రగతి ఎన్క్లేవ్, టాకీ టౌన్ రోడ్, వీడియో కాలనీ, ఎఫ్సీఐ పార్క్ మీదుగా కొత్త మార్గంలో పనులు చేపట్టాల్సిన అవసరం ఏమిటో అధికారులు స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. నాలా పనులపై పునరాలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సమ్మెట ప్రసాద్, రాజేంద్రప్రసాద్, కేఎన్ఎల్ స్వామి, వెంకటేశ్వరరావు, ఎన్వీ రావు, సూర్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, మాధవ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు లక్ష్మణ్, నాగుల్ గౌడ్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, విజయేందర్, శ్రీనివాస్, రాము, సురేష్, మహేష్ తదితరులు హాజరయ్యారు.





