మసీదుబండ 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు లైన్ క్లియర్: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి):శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండ 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు కీలక ముందడుగు పడింది. మాదాపూర్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, చీఫ్ సిటీ ప్లానర్ వెంకన్న, సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్‌తో కలిసి రోడ్డు విస్తరణలో భాగంగా స్థలాలు కోల్పోతున్న వారికి అంగీకార పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. మసీదుబండ రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో 120 మీటర్లుగా ఉన్నప్పటికీ, తన ప్రత్యేక చొరవతో 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు గ్రామస్థులు అంగీకరించారని తెలిపారు. స్థలాలు కోల్పోతున్న వారిని ఒప్పించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చేయడం జరిగిందన్నారు. అందరూ రోడ్డు విస్తరణకు అంగీకరించడం శుభపరిణామమని పేర్కొన్నారు.

రోడ్డు విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోతున్న వారికి సముచిత న్యాయం చేయాలని గాంధీ అధికారులను కోరారు. జీవనాధారాన్ని కోల్పోతున్న బాధితులకు అండగా నిలవాలని, అందరికీ సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థలాలు, భవనాలు కోల్పోతున్న వారికి TDR (Transferable Development Rights) అందేలా చూడాలని, TDR ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మసీదుబండ రోడ్డు విస్తరణ సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించిందని గాంధీ అన్నారు. రోడ్డు విస్తరణ పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. పనులను త్వరితగతిన చేపట్టి ప్రజలకు రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గాంధీ సూచించారు. ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైన చోట్ల లింక్ రోడ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రోడ్ల విస్తరణ, ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధి ద్వారా ప్రజలకు ట్రాఫిక్ రహిత ప్రయాణ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ACP శైలజ, ACP అక్బర్, మసీదుబండ ప్రాంత వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here