శేరిలింగంపల్లి, ఆగస్టు 11 (నమస్తే శేరిలింగంపల్లి): జోన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులతో పాటు వన్ డే–వన్ వార్డ్ కార్యక్రమం పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన కొత్త పనుల ప్రతిపాదనలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల స్థితిగతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవాలని నారాయణ్ అమిత్ సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో డిప్యూటీ కమిషనర్లతో పూర్తి సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతోపాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. సమీక్షా సమావేశంలో శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.





