గాంధీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఫైర్.. కేసీఆర్, కేటీఆర్ కృషిని విస్మరించడం హాస్యాస్పదమన్న రంగారావు..

శేరిలింంగ‌ప‌ల్లి, జూన్ 9 (న‌మ‌స్తే శేరిలింంగ‌ప‌ల్లి): మియాపూర్ డివిజన్‌లో కలిదిండి రోజా, బీఎస్‌ఎన్ కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ మియాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి వల్లే అభివృద్ధి సాధ్యమైందని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. గతంలో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు దాదాపు రూ.9,500 కోట్లతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని ప్రజలకు చెప్పి ఓట్లు అడిగిన ఆరెక‌పూడి గాంధీ, ఇప్పుడు అదే నాయకుల పేర్లను ప్రస్తావించకుండా మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు.

2014కు ముందు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉండేదో, బీఆర్ఎస్ పాలన తర్వాత ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, లింక్ రోడ్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యలను ఎలా తగ్గించారో ప్రజలకు బాగా తెలుసన్నారు. అలాగే వేలాది మంది పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందించిన విషయాన్ని కూడా విస్మరించరాదన్నారు. రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌లో చేరిన ఆరెక‌పూడి గాంధీ, రేవంత్ రెడ్డితో కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడు శంకుస్థాపనలతోనే గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగి ఉంటే ప్రస్తుతం చేస్తున్న శంకుస్థాపనలు అప్పటికే ప్రారంభోత్సవాలుగా జరిగేవని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన రంగారావు.. నిజంగా ప్రతిపక్ష భావన ఉంటే బీఆర్ఎస్‌లోకి తిరిగి రావాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా తీర్పు పొందాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించిన ఆయన.. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here