కోనేరు హంపికి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా ధైర్య పురస్కారం

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు ఆధ్వర్యంలో కొన‌సాగుతున్న నాద బ్రహ్మోత్సవ్- 2025లో భాగంగా దశమి రోజున సాయంత్రం శోభారాజుచే శిక్షణ పొందిన అన్నమాచార్య భావనా వాహిని సంస్థ విద్యార్థులు అర్జున్, కృతిక, హరిని, అభినవ్, అభిరామ్, అక్షయ్, మానస పటేల్, తన్వి, హితస్వి, మోక్ష, కర్ణిక, సువర్ణ, పద్మశ్రీ, జనని భవిష్య, చైత్ర, రన్విత, ఆశ్రిత, అక్షయ, దుర్గాభవాని, వాసంతి, జానకి, డా. శశికళ, మారుతి విజయలక్ష్మి, పార్వతి, బి. వి. శర్మ, ఆహన సంయుక్తంగా మాతృదేవోభవ, అంబికే జగదంబికే, చిత్తము కొలది, కొండలలో నెలకొన్న కోనేటి రాయుటివాడు, నానాటి బతుకు నాటకము అనే సుప్రసిద్ధ అన్నమయ్య సంకీర్తనలను శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి సభక్తి పూర్వకంగా సమర్పించారు. యుక్తా రెడ్డి హిమగరి తనయే హేమలతే అనే సంకీర్తనకు నృత్య కైంకర్యం చేశారు.

ఈ కార్యక్రమానికి భారత‌ మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, రిటైర్డ్ ఐపీఎస్ జె. డి. లక్ష్మినారాయణ ముఖ్య అతిథులుగా హాజ‌రై ప్రఖ్యాత చెస్ గ్రాండ్మాస్టర్, అర్జున, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోనేరు హంపికి ధైర్య అనే పురస్కారాన్ని బహుకరించారు. అనంత‌రం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ చిత్తశుద్ధి, శ్రీ వారి కృప వలనే ఇంత చక్కని నాద బ్రహ్మోత్సవం జయప్రద మైందని, ఇష్టమైన పనిని కష్టపడైనా చేస్తే నష్టపడేది లేదని చెప్పారు. నేచర్, కల్చర్, టుగెదర్ మేక్ అవర్ ఫ్యూచర్ అని చెప్పి ప్రకృతి భగవంతుని కానుక కావున పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, సాంప్రదాయ వస్త్రధారణ, పిల్లలు పేర్లు, సినిమాలు మనలో స్ఫూర్తినింపేలా ఉండాలని అన్నారు. జే. డి. లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఒక‌ లక్ష్యం సాధించడానికి ప్రణాళిక ఎంత అవసరమో ఆచరణ కూడా అంతే ముఖ్యమని, అన్నమయ్య పాటలు జన బాహుళ్యానికి చేరేందుకు శోభారాజు చేస్తున్న కృషి అభినందనీయమ‌ని అన్నారు. చివరిగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here