శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీ యంసిపిఐ(యు) పోటీ చేస్తున్నదని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తెలిపారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ తో కలిసి రవి సంయుక్తంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యుడు, అఖిలభారత ప్రజా తంత్ర యువజన సమాఖ్య (AIFDY) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , బిఎల్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న వనం సుధాకర్ ని అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వనం సుధాకర్ కి బి ఎల్ ఎఫ్ భాగస్వామ్య పక్షాలే కాకుండా వామపక్ష, సామాజిక ప్రజాస్వామిక, లౌకిక శక్తులు సంఘాలు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఎస్ సి, ఎస్ టి, బిసి, మైనారిటీ వర్గాల ప్రజలు విద్యావంతులు, మేధావులు యువకులు, నిత్యం ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడుతున్న వనం సుధాకర్ కి సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.






