- ఒకచోట కూపన్లు… మరోచోట ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కారణం…
- సూపర్‌మార్కెట్లు, టిఫిన్‌సెంటర్లు సూపర్‌స్ప్రెడర్స్ కేటగిరిలో కలిపితే సంఖ్య పెరగచ్చని పలువురు అభిప్రాయం…
నమస్తే శేరిలింగంపల్లి: సూపర్‌స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో నాల్గవ రోజు జంట సర్కిళ్ల మధ్య భారీ తేడా చోటు చేసుకుంది. శేరిలింగంపల్లి సర్కిల్‌లో సోమవారం 345 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకోగా చందానగర్ సర్కిల్‌లో మాత్రం 922 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రతీ రోజు ఒక్కో సర్కిల్‌లో వెయ్యిమందికి వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఐతే ఒక చోట 35 శాతం మంది మించక పోగా మరోచోట 92 శాతానికి మించి వ్యాక్సిన్ వేయించుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఐతే రెండింటి మధ్య వ్యత్యాసానికి బలమైన కారణం ఉంది. చందానగర్‌లో కూపన్‌ల ద్వారా లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తుండగా, శేరిలింగంపల్లి సర్కిల్‌లో మాత్రం ప్రత్యేకమైన యాప్ ద్వారా సూపర్‌స్ప్రెడర్స్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి కూపన్‌లు జారి చేయడం సులువు అవతుండగా, ఆన్‌లైన్ చేయడం కొంత సమయం తీసుకుంటుంది. దానికి తోడు లాక్‌డౌన్ టైమ్‌లోనే రిజిస్ట్రేషన్‌లు చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో వివిధ దుఖానాల దారులు ఆ సమయంలో తమ వ్యాపారంపైన దృష్టి సారిస్తూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను విస్మరిస్తున్నారు. ఐతే సోమవారం నుంచి లాక్‌డౌన్ సమయం మూడు గంటలు పెరుగడంతతో మంగళవారం నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగొచ్చని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్థుతం సూపర్ స్ప్రెడర్స్ కేటగిరిలో రైతుబజార్లు, కురగాయల మార్కెట్లు, పూలు, పండ్లు, మాసం, కిరాణా, మధ్యం దుఖాణ దారులు, వీదివ్యాపారులు, చాకలి, మంగలి కుల వృత్తిదారులను చేర్చగా హోటల్, టిఫిన్ సెంటర్లు, సూపర్ మార్కెట్‌లను సైతం ఈ కేటగిరిలో కలిపితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లలోను సంఖ్య పెరుగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లో 256 మందికి వ్యాక్సిన్…
కొండాపూర్‌లోని జిల్లా దవాఖానాలో రెండవ రోజు సూపర్‌స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉత్సాహంగా జరిగింది. జీహెచ్ఎంసీ వారు ఇచ్చిన జాబితా ప్రకారం మొత్తం 256 మంది కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాగా 45 ఏళ్ల పైబడిన వారి కేటగిరిలో 136 మంది, 18 ఏళ్ల పైబడిన వారి కేటగిరిలో 120 మంది మొదటి డోసు తీసుకున్నారు. మంగళవారం సైతం ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని సూపరింటెండెంట్ వరదాచారి తెలిపారు.