
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ ముజఫర్ అహ్మద్ నగర్ లోగల ఓంకార క్షేత్రంలో హెచ్ఎండిఏ అధికారులు నిర్దాక్షిణ్యంగా చేపడుతున్న కూల్చివేతలను నిలిపివేసి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు హెచ్ఎండీఏ ప్రధాన కార్యదర్శికి సోమవారం మెమోరాండం సమర్పించారు. గత రెండు నెలల కిందట కొందరు బీజేపీ నాయకులు రాజకీయ దురుద్దేశంతో చేసిన తప్పుడు ఆరోపణలు పరిగణలోకి తీసుకొని హెచ్ఎండిఏ అధికారులు నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని, కళ్యాణ మండపాన్ని కూల్చివేయడం అన్యాయమన్నారు. తాజాగా గుడిలో ఆహ్లాద వాతావరణం ఏర్పాటు చేసేందుకు వీలుగా పూలమొక్కల కోసం ఏర్పాటు చేసిన పందిరిని మే 26న అధికారులు తొలంగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఇకనైనా అధికారులు ఆలయ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా సహకరించాలని వారు కోరారు. ఆలయ కమిటీ నిర్ణయం లో భాగంగా బస్తీవాసులు, స్థానికుల సౌకర్యార్థం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని రూ.5 నామమాత్రపు రుసుముతో మంచినీరు అందించనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు.