- ఉదారతను చాటుకున్న చింతకింది మీనా మహేందర్ గౌడ్
- శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సొంత ఖర్చుతో మరుగుదొడ్ల నిర్మాణం
- ఆమేను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్యే గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: ఒకప్పుడు ఆమె అదే పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యను అభ్యసించింది. ఐతే రెండున్నర దశాబ్దాల తర్వాత సదరు పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంది. ఆ పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక విద్యార్థినిలు పడుతున్న అవస్థలను చూసి చలించిపోయింది. తమ లాగా ప్రస్తుత విద్యార్థినిలు ఇబ్బందులు పడొద్దని సొంత ఖర్చుతో మరుగుదొడ్ల నిర్మాణానికి పూనుకుంది. వివరాల్లోకి వెళితే..
గోపినగర్ కు చెందిన చింతకింది మీనా మహేందర్ గౌడ్ శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యను అభ్యసించింది. ఇటీవల 1999-2000 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అదే పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. అయితే అక్కడ సౌకర్యాల లేమితో బాధపడుతున్న విద్యార్థులను గమనించిన మీనా మహేందర్ గౌడ్ నేటి విద్యార్థుల సౌకర్యాల కోసం తోచిన సహకారం అందించాలని నిర్ణయించుకుంది. తోటి స్నేహితులతో చర్చించగా అందరూ కలసి మరుగుదొడ్ల నిర్మాణం చేయిద్దామని అనుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా ఇతరుల నుంచి సానుకూలమైన స్పందన లభించకపోవడంతో మీనా మహేందర్ గౌడ్ స్వయంగా రూ.5 లక్షలు వెచ్చించి మరుగుదొడ్ల నిర్మాణానికి పూనుకుంది. ఏకకాలంలో 20 మంది విద్యార్థినిలు మరుగుదొడ్లను ఉపయోగించుకునేలా నిర్మాణ నమూనాను సిద్ధం చేయించింది. ఈ క్రమంలోనే గురువారం స్థానిక శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ఒక పూర్వ విద్యార్థిని ప్రస్తుత విద్యార్థుల కోసం పరితపించి తన ఉదారతను చాటుకోవడం అభినందనీయమని అన్నారు. ఇతర విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని, భవిష్యత్తులో నిరుపేద విద్యార్థుల కోసం తోచిన సహకారం అందించాలని సూచించారు. మీనా మహేందర్ గౌడ్ మాట్లాడుతూ తాము చదువుకుంటున్న రోజుల్లో పాఠశాలలో కనీస వసతులు లేక ఎన్నో అవస్థలు పడ్డామని, రెండున్నర దశాబ్ధాలు గడిచినప్పటికీ విద్యార్థులు అవే ఇబ్బందుల నడుమ విద్యను అభ్యసించడం కలిచి వేసిందని అన్నారు. తన వంతు బాధ్యతగా తోచిన సహకారం అందించేందుకు ముందుకు వచ్చానని, భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, మిరియాల రాఘవరావు, గణేష్ ముదిరాజ్, మారబోయిన రాజు యాదవ్, పద్మారావు, నటరాజ్ గుప్త, ప్రసాద్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.