మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కూలి పని చేస్తున్న ఇద్దరు యువకులు దురదృష్టవశాత్తూ విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాల బారిన పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగంకు చెందిన జితేందర్ (24), ఉమాకాంత్ (21)లు 2 ఏళ్ల కిందట బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు మాదాపూర్‌లోని గూగుల్ కంపెనీ కార్యాలయం ఎదుట ఓ భవన నిర్మాణ సంస్థలో గురువారం కూలి పనులు చేయసాగారు. అందులో భాగంగా వారు యంత్రం సహాయంతో ఇనుప రాడ్‌లను కట్ చేస్తున్నారు.
కాగా వైర్ కట్ చేస్తుండగా అందులో నుంచి షాక్ వచ్చింది. అదే సమయంలో ఇనుప రాడ్‌ను జితేందర్, ఉమాకాంత్‌లు ఇద్దరూ పట్టుకుని ఉన్నారు. దీంతో వారు తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ క్రమంలో వారు తీవ్ర గాయాలకు లోనై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, జితేందర్ సోదరుడు సికిందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా సేఫ్టీ పరికరాలు లేకుండా పనులు చేయిస్తున్న భవన నిర్మాణ సంస్థ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.