నమస్తే శేరిలింగంపల్లి: త్వరలో జరగనున్న మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి రాగం సతీష్ యాదవ్ శుక్రవారం ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రశ్నించే గొంతుకనై ప్రజల వద్దకు వస్తున్నానని తెలిపారు. తనకు పట్టభద్రులు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగుల గురించి ఏనాడూ బిజెపి రాంచందర్ రావు మాట్లాడలేదని పేర్కొన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్సీలు నిరుద్యోగుల గురించి కానీ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, ఇతర సంస్థలలో పనిచేసే గ్రాడ్యుయేట్స్ గురించి కానీ ఒక్కరోజైనా ఆలోచించలేదన్నారు. కోవిడ్ కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా తొంభై వేల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఎమ్మెల్సీ ఓట్లు అడిగే హక్కు తెరాస, బీజేపీకి లేదన్నారు. గ్రాడ్యుయేట్స్ కోసం 14 కోచింగ్ సెంటర్ లను స్థాపించడం జరిగిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్స్ అందడం లేదని రాగం సతీష్ యాదవ్ పేర్కొన్నారు.
