శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): వనమహోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ కొండాపూర్లోని గీతాంజలి ది గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) 8వ బెటాలియన్ ప్రాంగణంలో గురువారం మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు ఉత్సాహంగా పాల్గొని పలు రకాల మొక్కలను నాటారు. అనంతరం పాఠశాల పరిసర ప్రాంత ప్రజలకు మొక్కలను పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో TGSP 8వ బెటాలియన్ కమాండెంట్ ఎం. రామకృష్ణ, అసిస్టెంట్ కమాండెంట్ ఎస్. రాంబాబు, జేఏ (ఎస్ఐ) సత్యనారాయణ, పీఆర్వో (ఎస్ఐ) ఎ. మహేందర్ రెడ్డి, గీతాంజలి ది గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ డీవీఎన్ రావు, ప్రిన్సిపాల్ అక్షిత అగ్నిహోత్రి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై బాధ్యతాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.





