శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చేపడుతున్న అభివృద్ధి పనులను నేరుగా పర్యవేక్షించేందుకు ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా డీసీపీ ట్రాఫిక్-2 శేషాద్రిణి రెడ్డి, ఏసీపీ ఆది మూర్తి మియాపూర్ ఎక్స్‌రోడ్డును సందర్శించారు. ఈ సందర్భంగా మియాపూర్ ఎక్స్‌రోడ్ ఫ్రీ లెఫ్ట్, మియాపూర్ బస్‌స్టాప్ సర్వీస్ రోడ్, అలాగే మియాపూర్ మెట్రో పిల్లర్ నంబర్-600 సమీపంలో నిర్మిస్తున్న ఎక్స్‌టెండెడ్ యూ-టర్న్ అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ఈ పనులన్నీ వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు చేపడుతున్నవే కావడం గమనార్హం. అధికారులు పనుల పురోగతిని సమీక్షిస్తూ, ట్రాఫిక్ ప్రవాహం మరింత మెరుగుపడేలా అవసరమైన సూచనలు, ఆదేశాలను సంబంధిత అధికారులకు జారీ చేశారు. పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మియాపూర్ ఎక్స్‌రోడ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని, వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.






