గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ఓ మహిళ పోగొట్టుకున్న బంగారు పుస్తెల తాడును తిరిగి ఆమెకు ఇచ్చి ఓ ట్రాఫిక్ హోం గార్డు నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కార్మికనగర్‌కు చెందిన కొండా మమత (35) అక్టోబర్ 10వ తేదీన కొండాపూర్‌లోని తన తల్లిని చూసేందుకు వచ్చింది. తిరిగి ఆమె కొండాపూరూ్ ఎక్స్ రోడ్డు వద్ద ఆర్‌టీసీ బస్సు ఎక్కింది. అదే సమయంలో ఆమె బంగారు పుస్తెల తాడు మెడలోంచి జారి కిందపడిపోయింది. ఆమె దాన్ని గమనించలేదు. ఆ పుస్తెల తాడు బరువు 52 గ్రాముల వరకు ఉంటుంది. విలువ రూ.2 లక్షల వరకు ఉంటుంది. అయితే అక్కడే విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హోం గార్డు మల్లేష్ ఆ తాడును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో అందజేశాడు.
ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీసులు ఇతర పోలీస్ స్టేషన్లలో ఆ తాడు పోయిందని ఎవరైనా కేసు నమోదు చేశారా అని విచారించారు. ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో వారు సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఈ క్రమంలో మమత ఆ విషయం తెలిసి తన భర్త నరేందర్‌తో కలిసి గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ సందర్భంగా పుస్తెల తాడును చూసి గుర్తు పట్టడంతో పోలీసులు అన్ని వివరాలను సేకరించి ఆ తాడు ఆమెదే అని నిర్దారణకు వచ్చి అనంతరం ఆ తాడును ఆమెకు అందజేశారు.
సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ఈ సందర్బంగా హోం గార్డు మల్లేష్‌ను అభినందించారు. అతనికి రివార్డును అందజేశారు. పోలీసులు ఇటీవలి కాలంలో పలు మార్లు ఇలాగే సేవలను అందించారని గుర్తు చేశారు. కాగా తమ బంగారు పుస్తెల తాడును తమకు తిరిగి అప్పగించినందుకు గాను మమత, ఆమె భర్త నరేందర్‌లు పోలీసులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.