సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): పదే పదే దొంగతనాలకు పాల్పడుతున్న పది మంది అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
సాఖి అహ్మద్ అనే వ్యక్తి 2020 జూలైలో తన స్నేహితులు రామ్ కుమార్ సింగ్, హసీన్‌లతో కలిసి ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అనంతరం బిజేందర్, మెహ్‌తాబ్ బతి, జితేందర్ సింగ్, ఇర్ఫాన్ అలీ, హకీం సింగ్, హబీబుల్, రహమాన్ అనే మరికొందరు స్నేహితులను సాఖి అహ్మద్ అక్కడకు రప్పించాడు. వారు పటాన్‌చెరులో ఓ బంగారు దుకాణం వద్ద 4 నుంచి 5 రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. అనంతరం పలు మార్లు దొంతగనం చేసేందుకు యత్నించారు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరో ఒకరు చూడడంతో బంగారం దొంగతనం చేయాలనే వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో వారి గురించి సమాచారం అందుకున్న శంషాబాద్ జోన్ ఎస్‌వోటీ పోలీసులు జగద్గిరిగుట్టలో వారు నివాసం ఉండే ఇంటిపై దాడి చేసి మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రెండు తపంచాలు, 15 రౌండ్ల బుల్లెట్లు, 4 హాక్ సా బ్లేడ్లు, 4 ఐరన్ రాడ్లు, ఒక పెద్ద స్క్రూ డ్రైవర్, ఒక కటింగ్ ప్లేయర్, ఒక టెస్టర్, ఒక డీసీఎం వాహనం, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా వారికి కోర్టు ఆగస్టు 29, 2020న రిమాండ్ విధించింది.
అయితే సదరు నిందితులు బెయిల్ నుంచి బయటకు వచ్చినప్పటికీ తిరిగి అదే నేరానికి పాల్పడుతారన్న ఉద్దేశంతో సీపీ సజ్జనార్ వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు కాగా వారిని తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు.