శేరిలింగంపల్లి, నవంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ రాజీవ్ కాలనీ (వడ్డెర బస్తీ) లో గత 40 ఏళ్లకు పైగా ఆలయం ఉండగా అందులో గత కొన్ని నెలల క్రితం వారు శివాలయం కట్టాలని నిర్ణయించుకుని నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ప్రక్కన ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణం జరుగుతుండగా వారికి రోడ్ ఉన్నదని ఆలయాన్ని తొలగించాలని కాలనీ వాసులను వొత్తిళ్ళకు గురిచేస్తూ పోలీసులతో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని కాలనీ వాసులు తెలియజేశారు. కాగా ఈ సందర్భంగా కాలనీలోని ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ సందర్శించి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆలయం ఎన్నో ఏళ్ల నుండి ఉన్నదని ఈరోజు కొత్తగా రోడ్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయాన్ని తొలగించే ప్రసక్తే లేదని ఆలయం జోలికి వస్తే రాష్ట్ర స్థాయిలో అన్ని వర్గాల వారిని కలుపుకుని అడ్డుకుంటామని హెచ్చరించారు, కాలనీ వాసులకు ఏ సమయమైనా అండగా ఉంటానని హామీ ఇచ్చారు, అవసరమైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, రాజేందర్ రెడ్డి, వెంకటేష్, మల్లేష్, మన్యం కొండా సాగర్, స్థానిక కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.