శేరిలింగంపల్లి, ఏప్రిల్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు పిరికిపందల్లా దాడి చేశారని శేరిలింగంపల్లి ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ అన్నారు. ఈ దాడిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా గూండాల రాజ్యంగా మార్చేశారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నించారు. పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి కాంగ్రెస్‌కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. దాడులకు పాల్పడుతున్న మూకలను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ సన్నాసుల్లారా, మీ చిల్లర దాడులకు బీఆర్ఎస్ ఏమాత్రం భయపడదు అని హెచ్చరించారు. గ్రామ సభల్లో ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్నారు. ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. ప్రజలే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దంగా వున్నారని చిర్రా రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు.






