అన్న‌మాచార్య భావన వాహినిలో అల‌రించిన ఆశ్రిత స్వ‌రార్చ‌న

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ జరిగింది. అనంతరం సాయంత్రం యథావిధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అన్నమయ్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది. అనంతరం అన్నమాచార్య భావనా వాహిని శిష్యురాలు, పద్మశ్రీ డా. శోభారాజు దగ్గర తన‌ చిన్నతనం నుండి శిక్షణ పొందుతున్న ఆశ్రిత స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి తన తొలి అన్నమయ్య స్వరార్చనను సభక్తి పూర్వకంగా సమర్పించి మధుర స్వరాలతో స్వరంగేట్రం చేసింది.

సుమారు 8 సంవత్సరాల నుండి తల్లి అర్చన, ఆశ్రిత కలిసి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు మార్గదర్శకత్వంలో అన్నమయ్య సంకీర్తనలతోపాటు పలు సేవా కార్యక్రమాలు, సామాజిక నైతిక విలువలు నేర్చుకుని అన్ని విభాగాల్లో ప్రగతి పథంలో ముందుకు నడుస్తున్నందుకు వారు శోభారాజుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ నందకాయ, శ్రీమద్ త్వదీయ అనే గురు స్తుతితోపాటు నాలుగు మంత్రాలు, మాతృదేవో భవ, చదువు చెప్పవమ్మా, అంబికే జగదంబికే, దేవునికి దేవికిని, ఇంత చక్కని పెళ్లికొడుకు, నమామ్యహం, కొలిచితే రక్షించె, సిరుత నవ్వులవాడు వంటి అన్నమయ్య సంకీర్తనలను సుమనోహర స్వర సమన్వయంతో ఆలపించి విచ్చేసిన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ స్వరార్చనకు కీబోర్డు రాజు, తబల రామ కృష్ణ వాయిద్య సహకారం అందించి గానానికి మరింత మాధుర్యం చేకూర్చారు.

ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు ఒక అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి ఆశ్రిత గానాన్ని అభినందించారు. భక్తి, సాహిత్య భావం, లయ సమన్వయంతో సాగిన ఈ స్వరార్చన భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచిందని తెలిపారు. అనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ ఆశ్రితకు, వాద్య కళాకారులకు శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో విజయవంతంగా ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here