శేరిలింగంపల్లి, జూలై 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రజ్ఞా డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పాల్గొని విద్యార్థులకు ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన విద్యార్థులు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో తమ ఓటరు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే తమ తల్లిదండ్రులు, బంధువులు ఇతర అర్హులైన ఓటర్లకు ఫారాలు నింపడంలో సహాయం చేసి, ఓటరు వివరాల ధ్రువీకరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మీ ఓటు.. మీ హక్కు.. మీ బాధ్యత అనే భావనను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్న బొబ్బ నవత రెడ్డి, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని అన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభమని, సమాజంలో గౌరవం, బాధ్యతలను నిలబెట్టే శక్తి ఓటుకే ఉందని పేర్కొంటూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు రాజు, చందర్ రావు, సలీం, శబానా బేగం, శ్రీనివాస్ (బాబులు), నగేష్ రెడ్డి, వంశీ రెడ్డి, జె.వి. రావు, అనంత రెడ్డి, అంజి యాదవ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.





