శేరిలింగంపల్లిలో SIR పరిశీలన.. అధికారులకు రవికుమార్ యాదవ్ సూచనలు

శేరిలింగంపల్లి, జూలై 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్ కాలనీల్లో బీఎల్వోలు, బీజేపీ బీఎల్ఏలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ SIR ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, పెండింగ్ దరఖాస్తులు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 55 శాతం మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అధికారులకు సమర్పించారని తెలిపారు. ఈ పురోగతిలో బీజేపీ బీఎల్ఏల పాత్ర కీలకమని అభినందించారు. ఈ నెల 31లోపు పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారులందరూ ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి సమర్పించేలా కృషి చేయాలని సూచించారు.

ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు బూత్‌లలో నమోదై ఉంటే వారిని ఒకే బూత్‌కు మార్చే చర్యలు చేపట్టాలని, అలాగే దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా సిద్ధం చేయాలని బీఎల్వోలు, అధికారులకు సూచించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన తర్వాత 18 ఏళ్లు నిండిన అర్హులైన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయడంతో పాటు, అవసరమైన వారికి ఫారం-8 ద్వారా ఓటు మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి రోజు బీఎల్ఏలు తమ పరిధిలోని బీఎల్వోల నుంచి ఎన్ని ఫారాలు తిరిగి వచ్చాయి, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను సేకరించి పార్టీ నాయకత్వానికి అందించాలని సూచించారు. నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు తమ డివిజన్లలో బీఎల్ఏలకు అండగా నిలిచి SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆంజనేయులు సాగర్, రవి నాయక్, సంతోష్, రేఖా, మేరీ, ఆమని, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here