శేరిలింగంపల్లి, జూలై 27 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పౌరుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 45 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి 25 ఫిర్యాదులు అందాయి. పౌరులు వివిధ పౌర సేవలకు సంబంధించిన సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించగా, సంబంధిత విభాగాధిపతులు వాటిని పరిశీలించారు. విభాగాల వారీగా టౌన్ ప్లానింగ్‌కు 25, ఇంజినీరింగ్‌కు 11, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కు 2, శానిటేషన్‌కు 2, అడ్మినిస్ట్రేషన్‌కు 1, చెరువులు (లేక్స్) విభాగానికి 1, ప్రాజెక్టులకు 1, రెవెన్యూ (ఆస్తి పన్ను)కు 1, అర్బన్ బయోడైవర్సిటీ విభాగానికి 1 ఫిర్యాదు అందింది.

ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ ఐడి (Grievance ID) కేటాయించినట్లు కమిషనర్ సృజన తెలిపారు. ప్రజావాణి సందర్భంగా అందిన వినతులను విభాగాధిపతులు పరిశీలించి, సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకుని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులు తమకు కేటాయించిన గ్రీవెన్స్ ఐడి ద్వారా ఫిర్యాదు పురోగతిని తెలుసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సీఎంసీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.





