ప్రపంచ హెపటైటిస్ డే: కాలేయాన్ని కాపాడుకోవాలంటే ఇవి తప్పనిసరి.. వైద్యుల కీలక సూచనలు

శేరిలింగంపల్లి, జూలై 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా మంగళవారం సాయంత్రం హుడా ట్రేడ్ సెంటర్ సీనియర్ సిటిజన్స్ భవనంలో కొండాపూర్‌ కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ ఎం. విజయ్ కుమార్ మాట్లాడుతూ హెపటైటిస్ అంటే కాలేయంలో వాపు కలిగించే వ్యాధి అని తెలిపారు. వైరస్‌లతోపాటు అనారోగ్యకరమైన జీవనశైలి కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణమని చెప్పారు. హెపటైటిస్ A, B, C, D, E అనే ఐదు రకాల వైరస్‌ల వల్ల ఈ వ్యాధి సోకుతుందని వివరించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది జూలై 28న హెపటైటిస్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఈ ఏడాది థీమ్ Hepatitis: Lets Break It Down (హెపటైటిస్ – దీన్ని అధిగమిద్దాం) అని తెలిపారు. 2030 నాటికి వైరల్ హెపటైటిస్‌ను ప్రజారోగ్య ముప్పుగా నిర్మూలించడమే ప్రపంచ లక్ష్యమని పేర్కొన్నారు. హెపటైటిస్ లక్షణాలుగా కామెర్లు, ఆకలి మందగించడం, అలసట, పొట్ట నొప్పి, మూత్రం, మలం రంగు మారడం, కీళ్ల నొప్పులు, జ్వరం, చర్మ దురదలు వంటి సమస్యలు కనిపిస్తాయని చెప్పారు. చికిత్స ఆలస్యం అయితే కాలేయ సిరోసిస్‌తోపాటు లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు. కలుషితమైన ఆహారం, నీరు, రక్త మార్పిడి, వాడిన సిరంజీలను తిరిగి ఉపయోగించడం, రక్షణలేని లైంగిక సంబంధాల ద్వారా వైరల్ హెపటైటిస్ వ్యాపిస్తుందని వివరించారు. అలాగే మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాల వినియోగం, అధిక కొవ్వు పదార్థాలు, కల్తీ నూనెలు, రసాయనాలు కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు.

ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు ప్రతిరోజూ వ్యాయామం, యోగా, నడక, ధ్యానం చేయడం, ఆకుకూరలు, సీజనల్ పండ్లు, పీచు పదార్థాలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కాలేయాన్ని రక్షించుకోవచ్చని సూచించారు. హెపటైటిస్-ఎ సాధారణంగా త్వరగా కోలుకునే ఇన్ఫెక్షన్ కాగా, హెపటైటిస్-Bకి చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఖరీదైనవని తెలిపారు. నవజాత శిశువులకు పుట్టిన వెంటనే హెపటైటిస్-B టీకా వేయడం అత్యంత ముఖ్యమని చెప్పారు. హెపటైటిస్ వైరస్‌ను గుర్తించి, దానికి టీకా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ బరూచ్ బ్లంబర్గ్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది జూలై 28న ప్రపంచ హెపటైటిస్ డే నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారికి లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT) పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకులు జయంత్ కుమార్, నరసింహారావు, వేణుమోహన్, జి.వి.రావు, చంద్రశేఖర్‌తో పాటు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, జి.వి.రావు, జాకీర్ హుస్సేన్, వెంకట్ బంగారు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here