- సన్నాహక యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
- ఫిబ్రవరి 27న కన్యాకుమారిలో అధికారికంగా యాత్ర ప్రారంభం
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ఒకప్పుడు విశ్వ గురువుగా విరాజిల్లిన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడమే కాకుండా కొత్త తరానికి పరిచయం చేస్తూ ప్రపంచ పరివ్యాప్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీకాట్) మిషన్ 5151 సంస్థ తలపెట్టిన కుంభ్ సందేశ్ సన్నాహక యాత్రను జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్‌కుమార్, భారతీయం ఫౌండేషన్ చైర్ పర్సన్ సత్యవాణితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ భారతదేశంలోని అనేకమైన శాస్త్రాలు, సంప్రదాయాల గురించి సనాతనంగా మన పెద్దలు ప్రపంచానికి పాఠాలు నేర్పిస్తూనే ఉన్నారన్నారు. మరొకసారి కరోనా నేపథ్యంలో పాశ్చాత్య సంస్కృతులన్నింటిని పక్కకు పెట్టి భారతదేశంలో పాటించిన `నమస్కారం` పెట్టడంతోపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో కాళ్లు, చేతులు కడుక్కోవడం వంటి అనేకమైన అంశాలను యావత్ ప్రపంచమే పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటువంటి తరుణంలో కుంభ్‌సందేశ్ యాత్రతో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచమంతటా పరివ్యాప్తం చేసే విధంగా “జీకాట్ మిషన్ 5151“ ఆధ్వర్యంలో ఢిల్లీ వసంత్ తెలంగాణ గడ్డ మీద మొదలు పెట్టడం ప్రశంసనీయమని కొనియాడారు.
కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఈ తరుణంలో కన్యాకుమారి నుంచి హరిద్వార్ వరకు పాదయాత్ర చేస్తూ యావత్ ప్రపంచానికి కుంభమేళా, కుంభ్ సందేశ్ అంటే ఏమిటి..? వాటి గొప్పతనాన్ని తెలియపరుస్తూ పాదయాత్ర చేయడమనేది ఎంతో గొప్ప విషయమని కవిత ప్రశంసించారు. కుంభ్ సందేశ్ యాత్ర మానవాళికి ఎంతో మేలు చేస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. జీకాట్ మిషన్ 5151 సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీ వసంత్ ఎంతో ఉన్నతాశయంతో చేపట్టిన కుంభ్‌సందేశ్ యాత్రకు తన వ్యక్తిగతంగానే కాకుండా తెలంగాణ జాగృతి, ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలతోపాటు సంపూర్ణ మద్దతు ఉంటుందని కవిత ప్రకటించారు. ఈ కుంభ్ సందేశ్ యాత్ర సందేశం ప్రజలందరికీ చేరాలని కోరుకుంటున్నట్లు కవిత తెలిపారు. అనంతరం జీకాట్ మిషన్ 5151 బృందం సభ్యులు కుంభ్‌సందేశ్ భావ వ్యాప్తికి సహకరించాలని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్‌కుమార్ ను కోరారు. ప్రణాళిక వ్యవస్థలో ఒక భాగమైన కుంభ్‌సందేశ్ అంశానికి తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయం కూడా సహకరించే విధంగా చూడాలని కోరారు. కుంభ్‌సందేశ్ వ్యాప్తికి తనవంతుగా కృషి చేస్తానని బి. వినోద్‌కుమార్ జీకాట్ బృందానికి హామీ ఇచ్చారు. కుంభ్ సందేశ్ యాత్ర విజయవంతం కావడానికి భారతీయం సంస్థ చైర్మన్ సత్యవాణి, మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.

కుంభ్‌సందేశ్ యాత్రలో ఆదిశంకరాచార్యుల స్ఫూర్తి: ఆచార్య అవినాశ్‌రాయ్
అలహాబాద్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు కుంభమేళా నిర్వహణ కమిటీ సభ్యుడు ఆచార్య అవినాశ్‌రాయ్ మాట్లాడుతూ ప్రకృతితో సహజీవనం, భారతీయుల సమైక్యత కోసం ఆదిగురువు శంకరాచార్యులు కృషి చేసినట్లుగానే కుంభ్‌సందేశ్ ఉద్ధేశం ఎంతో గొప్పగా ఉందని కొనియాడారు. ఈ కుంభ్ సందేశ్ ఆర్గనైజింగ్ కమిటీలో భాగస్వాములు కావడానికి జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంతటి బృహత్తర కార్యక్రమం దక్షిణ భారతదేశంలో మొదలు కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జీ కుంభ్‌సందేశ్ యాత్ర ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ `మిషన్ 5151` మంకెన శ్రీనివాస్‌రెడ్డి, అరిగె రామస్వామి మెమోరియల్ సర్వీసెస్ వ్యవస్థాపక చైర్మన్ అరిగె మధుసూధన్, సీవోవో కామేశ్వర్‌రాజు, అడ్వైజర్ డాక్టర్ పాశం ప్రసాద్, జీకాట్ సెక్రటరీ పట్లోల్ల రాంరెడ్డి, జీకాట్ సీఈవో శ్రవణ్ మడప్, రెడ్డి జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
యాత్ర విశేషాలిలా…
హైదరాబాద్ నుంచి సన్నాహక యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో జీకాట్ వ్యవస్థాపకుడు, కుంభ్ సందేశ్‌యాత్ర నిర్వహణ కార్యదర్శి ఢిల్లీ వసంత్ యాత్రకు సంబంధించిన వివరాలు తెలిపారు. హైదరాబాద్‌లో సన్నాహక యాత్ర ప్రారంభమైందని, రెండు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోనూ కొనసాగుతుందని, తమిళనాడు చివర ఉన్న కన్యాకుమారి దగ్గర త్రివేణి సంగమం నుంచి అధికారికంగా ప్రారంభమయ్యే ఈ కుంభ్‌సందేశ్ యాత్ర కుంభమేళా జరిగే మొత్తం నాలుగు క్షేత్రాలకూ వెళ్తుందని అన్నారు. నాసిక్, ఉజ్జయిని, ప్రయాగరాజ్ మీదుగా దిల్లీకి చేరుకుంటుందని, ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకు పాదయాత్ర రూపంలో ఇది సంపూర్ణం కానుందని, హరిద్వార్ కు చెందిన దివ్యప్రేమ సేవా మిషన్, ఢిల్లీకి చెందిన ఐఎస్ఆర్ఎన్, హైదరాబాద్ కు చెందిన మాస్ సంస్థ, జేడీ ఫౌండేషన్, భారతీయం, ఇంపాక్ట్ ఫౌండేషన్ , రెడ్డి జేఏసీ వంటి అనేక సంస్థలు ఈ సందేశ్ యాత్రకు సహాయపడుతున్నాయని చెప్పారు.