న్యాయ‌వాద దంప‌తుల హ‌త్య కేసును సీబీఐచే ద‌ర్యాప్తు చేయించాలి: తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్రం లో ఇద్దరు హైకోర్టు న్యాయవాద దంపతులను అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణమని ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. వారి హ‌త్య‌ల‌ను ఆయ‌న ఖండించారు. ఇది న్యాయవ్యవస్థకే తీరని మచ్చన్నారు. మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిలు హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారని, తమ గ్రామం నుంచి వారు కారులో హైదరాబాద్‌కు వెళుతుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇద్దరిని పట్టపగలు కారు లోంచి బయటకు లాగి కత్తులతో నరికి చంపేశారన్నారు.

తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి

న్యాయవాద దంపతులు తమ వృత్తిలో భాగంగా హైకోర్టులో పలువురు రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక కేసుల్లో వాదనలు వినిపించడంతోపాటు ఇసుక మాఫియా అక్రమాలపై ధ్వజమెత్తారని, ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలపై తరచూ స్పందించడాన్ని జీర్ణించుకోలేని అరాచక వాదులు న్యాయవాద దంపతులు ఇద్దరిని అత్యంత అమానుషంగా హత్య చేయించడం శోచనీయమని అన్నారు. దంపతులు ఇద్దరికి రక్షణ కల్పించ వలసిందిగా హైకోర్టు పోలీసులను ఆదేశించినా వారు నిర్లక్ష్యం వహించడం క్షమించరానిదని, హత్య కేసులో వారిని కూడా బాధ్యులను చేయాలన్నారు. న్యాయవాద దంపతుల జంట హత్యల కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించి దోషులు ఎంతటి వారైనా అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వేత్తలు, న్యాయ కోవిదులు, దేశవ్యాప్తంగా న్యాయవాదులు, మానవ హక్కుల సంఘాలు సత్వరం స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్యమించాలని, దోషులు అరెస్టయిన తర్వాత వారి తరపున న్యాయవాదులు ఎవరూ కేసును వాదించ వద్దని తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి కోరారు. ఈ సంఘటనపై తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ హతులైన న్యాయవాద దంపతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here