- సగరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
- భగీరథ విగ్రహ ఆవిష్కరణ సభలో మంత్రి నిరంజన్ రెడ్డి
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): పేద వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ లో సగర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీశ్రీశ్రీ భగీరథ మహార్షి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగరతో కలిసి మంత్రి భగీరథ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నిర్మాణ రంగంపై ఆధారపడి కులవృత్తినే నమ్ముకున్న సగరులకు కావాల్సిన సహాకారాన్ని అందించేందుకు తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. కోకాపేట స్థల సమస్య పరిష్కారానికి మంత్రి కేటీఆర్ సమయం తీసుకుని సగర ప్రతినిధులతో చర్చ జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక జిల్లా పరిధిలో ఎలాంటి సమస్యలున్నా సగరులు తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ సగరుల పరిష్కారానికి ప్రభుత్వం తరపున కృషి చేయాలని మంత్రి ధృష్టికి తీసుకువచ్చారు. కోకాపేటలో ముందుగా కేటాయించిన స్థలాన్ని కొనసాగిస్తూ తమ జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని అన్నారు. సగర కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి, పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యధర్శి గౌరక్క సత్యం సగర, ఉపాధ్యక్షులు చిలుక సత్యం సగర, ప్రేం సగర, సంయుక్త కార్యదర్శి దామోదరయ్య సగర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సగర సంఘం అధ్యక్షుడు ఆర్.బి.ఆంజనేయులు సగర, శ్రీరంగాపూర్ సంఘం అధ్యక్షుడు విష్ణు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సత్యనారాయణ సగర పాల్గొన్నారు.