సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా ఏకకాలంలో 2058 సీసీటీవీ కెమెరాలను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఎస్సీ ఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, భరణి కె.అరోల్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్, మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, బాలానగర్ డీసీపీ పద్మజ, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 10 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడమే లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే 6 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ 2058 సీసీటీవీ కెమెరాలను ఏకకాలంలో ప్రారంభించడం ఇదే తొలిసారని అన్నారు. ఇందులో భాగంగా 18 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 111 కమ్యూనిటీలపై సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. 2058 సీసీటీవీ కెమెరాల్లో మాదాపూర్ జపోన్‌లో 1145, బాలానగర్ జోన్ 405, శంషాబాద్ జోన్ పరిధిలో 508 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయన్నారు. ఈ సందర్బంగా కెమెరా పైభాగంలో అమర్చబడిన 3 వాహనాలను కూడా డీజీపీ ప్రారంభించారు.