- కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): సామాజికంగా,రాజకీయంగా అన్ని విధాలా వెనుకబడిన శిష్టకరణ సామాజిక వర్గానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయూతనందించాలని కేంద్ర మాజీ మంత్రి, అఖిల భారత కాయస్ధ మహాసభ జాతీయ అధ్యక్షుడు సుభోధ్ కాంత్ సహాయ్ కోరారు. చందానగర్ లోని శిష్టకరణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యాలయంలో శిష్టకరణ ఓబీసీ సాధన కమిటీ జాతీయ కన్వీనర్ డీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత కాయస్ధ మహాసభ జాతీయ అధ్యక్షుడు సుభోధ్ కాంత్ సహాయ్ సభనుద్దేశించి ప్రసంగించారు.

శిష్టకరణం, కరణీగర్, కరణం పేరు ఏదైనా అందరం కాయస్తులమేనని, ఐక్యతతో ఓబీసీ సాధన దిశగా అడుగులు వేయాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇరువురు ముఖ్యమంత్రులను తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. శిష్టకరణాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. శిష్టకరణ, కరణీగర్, కరణంల సంక్షేమం కోసం ఇరు రాష్ట్రాల బీసీ కమిషన్ సభ్యులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. శిష్టకరణ ఓబీసీ సాధన కమిటీ జాతీయ కన్వీనర్ డీవీ కృష్ణారావు మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబడిన శిష్టకరణ సామాజిక వర్గాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతరం అఖిల భారత కాయస్ధ మహాసభ జాతీయ అధ్యక్షుడు సుభోధ్ కాంత్ సహాయ్ తో శిష్టకరణం, కరణీగర్, కరణం సభ్యులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కాయస్ధ మహాసభ సౌత్ ఇండియన్ కన్వీనర్ ప్రభాకరన్, శిష్టకరణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి. విజయ్ కుమార్, అడిషనల్ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత కాయస్ధ మహాసభ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణరావు, కోశాధికారి ఉరిటి పార్వతీశం, ఉపాధ్యక్షులు ఆర్. శేషగిరిరావు, హరగోపాల్, మహిళా కార్యదర్శి సత్యలక్ష్మీ, ప్రకాష్ రావు, పార్ధ సారధి, ప్రతాప్ రాజ్, ఆనందరావు, జయశ్రీ, శేషరత్నం, వికాస్ పాల్గొన్నారు.