శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి నేడు అనేక మంది బీజేపీలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్‌లు అన్నారు. శనివారం మియాపూర్ డివిజన్ తాపీ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రతాప్, గుండె గణేష్ లు కొండాపూర్ మసీదుబండలోని భిక్షపతియాదవ్ నివాసంలో ఆయనను, రవికుమార్ యాదవ్‌లను కలిశారు. త్వరలోనే తమ సంఘం తరఫున 500 మందితో కలిసి బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేటలో చేరిక కార్యక్రమం ఉంటుందని, అదే రోజు అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ గద్దెను, పార్టీ జెండాను ఆవిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాలని రవికుమార్ యాదవ్‌ను ఆహ్వానించగా అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భిక్షపతియాదవ్, రవికుమార్ యాదవ్ లు మాట్లాడుతూ తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. బీజేపీలో ఎవరు చేరినా ఆహ్వానిస్తామని, పార్టీ అండదండలు అందరికీ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జాజి రావు శ్రీను, రాము, చంద్ర మాసరెడ్డి, శివ, చక్రధర్ పాల్గొన్నారు.
