కానరీ ది స్కూల్‌లో వైభవోపేతంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా మియాపూర్‌లోని కానరీ ది స్కూల్‌లో శుక్రవారం ఉదయం తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు తెలుగు కవిత్వ సౌందర్యం, కవుల పరిచయం, గేయాలు, నాటికల ద్వారా ప్రేక్షకులను అలరించారు. గిడుగు రామ్మూర్తి జీవితం, ఆయ‌న కృషి, తెలుగు వ్యవహార భాషా ప్రాముఖ్యతను ప్రతిబింబించే ఏకపాత్రాభినయం వీక్షకులను ఆకట్టుకుంది. ప్రథమ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని స్వాగత నృత్యాలు, జానపద ప్రదర్శనలు చేశారు. భాష అంటే మన ఉనికి అనే సందేశంతో నాలుగవ తరగతి విద్యార్థులు నాటిక ప్రదర్శించి, మాతృభాష ప్రాధాన్యతను చక్కగా వివరించారు. కాళోజి నారాయణరావు, శ్రీకృష్ణదేవరాయలు, నన్నయ, తిక్కన, పోతన, బద్దెన వంటి మహాకవుల పద్యాలు, గేయాలు విద్యార్థుల నోట వినిపించాయి.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా మాట్లాడుతూ తెలుగు భాష మనకు గర్వకారణం. ఇది కేవలం సంభాషణా మాధ్యమం మాత్రమే కాదు, మన సంస్కృతి , సంప్రదాయాలకు నిలువుటద్దం కూడా. విద్యార్థులు ప్రతిరోజూ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. మన మాతృభాషను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో హెడ్ సీనియర్ స్కూల్ నవీన్, కోఆర్డినేటర్లు అపర్ణ, ముక్తా, తెలుగు భాషోపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here