ఓల్డ్ హఫీజ్‌పేట్‌లో వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఓల్డ్ హఫీజ్‌పేట్‌లో అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిమ్మల లక్ష్మినరహరి పటేల్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ వేడుకలను భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ హాజరయ్యారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా బాలింగ్ గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ.. లోకకల్యాణం కోసం లక్ష్మినరహరి గౌడ్ దంపతులు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భోళాశంకరుని ఆశీస్సులు, అన్నపూర్ణాదేవి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ప్రార్థించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here