శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు చేపట్టిన ప్రతిరోజు ఒక వార్డు (One Ward Every Day) కార్యక్రమంలో భాగంగా బుధవారం బొల్లారం వార్డులో మున్సిపల్ అధికారులు విస్తృతంగా పర్యటించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ క్షేత్రస్థాయిలో పర్యటించి పౌర సేవలు, మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు.

పర్యటన సందర్భంగా అధికారులు స్థానిక నివాసితులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. కాలనీల్లో ఎదురవుతున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రోడ్ల మరమ్మత్తులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ తదితర సమస్యలను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు కూడా సమర్పించారు. అనంతరం కమిషనర్ సృజన వార్డులో అందుబాటులో ఉన్న పౌర మౌలిక సదుపాయాలు, రోజువారీ పారిశుధ్య, ఇతర పౌర సేవలను సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కూడా పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
స్థానికులు లేవనెత్తిన ప్రధాన సమస్యలపై తక్షణమే చర్యలు చేపట్టాలని, వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని, వార్డులోని పౌర మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని, ప్రజలకు అందుతున్న పౌర సేవలను వేగవంతం చేయాలని, బొల్లారం వార్డును పరిశుభ్రమైన, సురక్షితమైన, మెరుగైన జీవన వాతావరణం కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ పర్యటనలో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఇంజనీరింగ్, పారిశుధ్య, విపత్తు నిర్వహణ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.





