శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్స్ లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమాన్ని నిర్వహించింది. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు గుండెపోటు హెచ్చరిక లక్షణాలను సకాలంలో గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడం, CPR, AED వినియోగంపై ప్రాథమిక అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. హరి కృష్ణ, డైరెక్టర్ డాక్టర్ ఏ.ఆర్. కృష్ణ ప్రసాద్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంపత్ కుమార్, ఇండియన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ హారికా ద్రోణవల్లి, TCS హైదరాబాద్ రీజినల్ హెడ్–HR శ్రీకాంత్ సురంపూడి, MCAలో రిజిస్టర్ అయిన డైరెక్టర్ రణబీర్ సింగ్ బగ్గ తదితరులు ముఖ్య అతిథులు, ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ గుండె ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఎప్పుడు, ఎవరికైనా ఎదురయ్యే అవకాశం ఉందని, గుండెపోటు ప్రమాద కారకాలు, ముందస్తు హెచ్చరిక లక్షణాలపై అవగాహనతో పాటు CPRపై ప్రాథమిక జ్ఞానం ఉంటే కీలక సమయంలో సరైన విధంగా స్పందించవచ్చని తెలిపారు. అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా ప్రజలను ప్రోత్సహించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. హరి కృష్ణ మాట్లాడుతూ సమాజంలో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తమ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఇతరులకు ఎలా సహాయం చేయాలో కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణంగా చెమటలు పట్టడం, అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం, చేతి, భుజం, వెన్ను లేదా దవడ వైపు నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నియంత్రించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా పాల్గొన్న ఇండియన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ హారికా ద్రోణవల్లి మాట్లాడుతూ ఆరోగ్యానికి కూడా చెస్‌లో మాదిరిగానే ఏకాగ్రత, క్రమశిక్షణ అవసరమన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, ఒత్తిడిని నియంత్రించుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజలు గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ ఏ.ఆర్. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గుండె అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం ఎంతో కీలకమని తెలిపారు. ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధికంగా చెమటలు పట్టడం, తల తిరగడం, చేతి, భుజం లేదా దవడ వైపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సకాలంలో వైద్య సహాయం అందించడంతో పాటు CPR, AEDను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ద్వారా అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన వ్యక్తికి అత్యవసర సమయంలో సహాయం అందించవచ్చని తెలిపారు.
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక హార్ట్ హెల్త్ కూపన్‌ను విడుదల చేసింది. ప్రజలు తమ గుండె ఆరోగ్యంపై ముందుగానే శ్రద్ధ వహించేలా ప్రోత్సహించేందుకు ఈ కూపన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆసుపత్రి తెలిపింది. ముఖ్య అతిథులు, ప్రత్యేక అతిథుల సమక్షంలో కూపన్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో నో యువర్ హార్ట్ ద్వారా గుండె ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన, రీడ్ ద సిగ్నల్స్ ద్వారా గుండెపోటు హెచ్చరిక లక్షణాలపై సమాచారం, సేవ్ ఎ హార్ట్ ద్వారా CPR, AED వినియోగంపై అవగాహన కల్పించారు. అలాగే రిసెట్ యువర్ హార్ట్ కార్యక్రమం ద్వారా ఒత్తిడి, నిద్ర, పోషకాహారం, శారీరక చలనం వంటి అంశాలపై, టేక్ హార్ట్ యాక్షన్ ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు.
గుండె ఆరోగ్యం అంటే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం మాత్రమే కాదని, వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, హెచ్చరిక లక్షణాలను సకాలంలో గుర్తించడం, అత్యవసర సమయంలో సరైన విధంగా స్పందించడం కూడా అంతే ముఖ్యమని కార్యక్రమం ద్వారా మెడికవర్ హాస్పిటల్స్ సందేశాన్ని ఇచ్చింది.





