శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల మత విశ్వాసాలను గౌరవించాలని, దేవుళ్లను పేదలు–ధనికులుగా విభజిస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర, రంగారెడ్డి అర్బన్ జిల్లా పార్టీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో మియాపూర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హఫీజ్పేట్ ఓల్డ్ పీస్ రోడ్లోని వాలెంటైన్ హోటల్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ.. వార్తల్లో వచ్చినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి శివుడు పేదల దేవుడు, శ్రీరాముడు ధనికుల దేవుడు అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. శివుడు, శ్రీరాముడు ప్రతి ఒక్కరికీ ఆరాధ్య దైవాలని, దేవుళ్లను ఒక వర్గానికి లేదా నిర్దిష్ట ఆర్థిక స్థితిలో ఉన్నవారికి మాత్రమే చెందినవారిగా చిత్రించడం తగదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్ల పేర్లను ఉపయోగించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించకూడదని అన్నారు. అలాగే మేము ద్రావిడులం, వారు ఆర్యులు అంటూ ప్రజలను వేర్వేరు వర్గాలుగా విభజించేలా వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ఐక్యంగా జీవిస్తున్నారని, ప్రజలను విభజించే వ్యాఖ్యలు సామాజిక ఐక్యతకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని భక్తులకు క్షమాపణ చెప్పాలని ప్రభాకర్ యాదవ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు అన్ని మతాలు, దేవుళ్లు, ప్రజల విశ్వాసాల పట్ల గౌరవంతో మాట్లాడాలని సూచించారు. ప్రజల మత విశ్వాసాలను కించపరిచే, సమాజంలో విభజన సృష్టించే వ్యాఖ్యలు పునరావృతం చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డిని గట్టిగా హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు మూల అనిల్ గౌడ్, జిల్లా కార్యదర్శి మాణిక్ రావు, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు విజేందర్ సింగ్, హఫీజ్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్, మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ రమణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీధర్ రావు, రవి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకులు నాగులు, రత్న కుమార్, జగన్ గౌడ్, ప్రసాద్ రావు, కిరణ్ రెడ్డి, పాపయ్య, యువ మోర్చా నాయకులు మన్యం యాదవ్, శ్రీను, మహేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





