శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ లో హార్ట్ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, మాదాపూర్ ఏసీపీ, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ వైద్యులు, మాదాపూర్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్‌తో పాటు ఇతర అధికారులు గుండె ఆరోగ్య పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. రోజువారీ వ్యాయామం చేయడం, సరదా కార్యకలాపాల్లో పాల్గొనడం, ప్రతి ఏడాది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అధిక బరువును తగ్గించుకోవడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేశారు.

పోలీస్ సిబ్బంది, ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కమిషనర్ ఎం. రమేష్ సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం, వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా గుండె సంబంధిత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.






