శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించిన సయ్యద్ హుస్సేన్ ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సయ్యద్ హుస్సేన్‌ను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.

అనంతరం సాయిబాబా మాట్లాడుతూ.. తెలుగు ఉపాధ్యాయుడిగా సయ్యద్ హుస్సేన్ ఎంతో మంది విద్యార్థుల్లో తెలుగు భాషపై ఆసక్తిని, మక్కువను పెంపొందించారని కొనియాడారు. ఆయన బోధనా విధానం, సాహిత్యంపై ఉన్న పట్టు ప్రశంసనీయమని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా హుస్సేన్ సేవలు సమాజానికి అవసరమని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొని సయ్యద్ హుస్సేన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.





