శేరిలింగంపల్లి, జూలై 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి డివిజన్‌లో ఆర్‌జీకే కాలనీ, పాపిరెడ్డి కాలనీ, గోపీనగర్ ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మారబోయిన రవి యాదవ్ మార్గదర్శకత్వంలో బీఎల్‌ఏ ఏజెంట్లు, బీఆర్‌ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను పరిశీలించారు. అర్హులైన ఓటర్ల వివరాలు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా అవగాహన కల్పిస్తూ సర్వే కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవడం, ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సర్వేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






