శేరిలింగంపల్లి, జూలై 3 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్‌తో కలిసి కొల్లూరు 2 బీహెచ్‌కే మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ), కొల్లూరు చెరువును సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెరువులో కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదులు, మురుగునీటి శుద్ధి వ్యవస్థ పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఈ తనిఖీలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, సాగునీటి శాఖ, గృహ నిర్మాణ శాఖ, పటాన్‌చెరు సర్కిల్ పారిశుద్ధ్య విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు.

పరిశీలన సందర్భంగా ఎస్‌టీపీ పనితీరు, కొల్లూరు చెరువులో కాలుష్యానికి దారితీస్తున్న ప్రధాన కారణాలు, మురుగునీటి నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు, అలాగే చెరువు పరిరక్షణ కోసం అమలు చేయాల్సిన కార్యాచరణపై అధికారులు చర్చించారు. కాలుష్యానికి గల మూల కారణాలను గుర్తించేందుకు అన్ని సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను అత్యంత ప్రాధాన్యంతో అమలు చేసి, కొల్లూరు చెరువు పరిరక్షణతోపాటు సమర్థవంతమైన మురుగునీటి నిర్వహణను నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు.





