గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): అధ్యాయనం పోరాటం బాటలో ఎస్ఎఫ్ఐ 1970లో ఏర్పడి నాటి నుండి ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అభిషేక్ అన్నారు. ఎస్ఎఫ్ఐ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అనంతరం అభిషేక్ మాట్లాడుతూ అనేక భాగాలతో కూడిన పోరాట బాటలో ఎస్ఎఫ్ఐ ప్రయాణం చేస్తుందని అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ విద్యార్థికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేసే ఏకైక సంఘం భారత విద్యార్థి ఫెడరేషన్ అని తెలిపారు.
విద్యా వ్యవస్థలోని అశాస్త్రీయ విద్య, మూఢత్వం ఉన్న ఈ వ్యవస్థను సమగ్రంగా మార్పు చేయడమే భారత విద్యార్థి ఫెడరేషన్ లక్ష్యమన్నారు. స్వాతంత్ర ప్రజాస్వామ్యం సోషలిజం అనే ఎజెండాతో ముందుకు వెళ్తున్న విద్యార్థి సంఘం అని గుర్తు చేశారు. నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా అశాస్త్రీయ దృక్పథంతో తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తుందని, దీన్ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. విద్య ప్రైవేటీకరణ కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామన్నారు. అనేక విచ్ఛిన్నకర శక్తులతో పోరాడి తమ సంఘానికి చెందిన ఎంతో మంది విద్యార్థి సంఘాల నాయకులను పోగొట్టుకున్న చరిత్ర భారత విద్యార్థి ఫెడరేషన్ కు ఉందని అన్నారు. వారికి భారత విద్యార్థి ఫెడరేషన్ సగర్వంగా నివాళులర్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్, సహానా, మృత్యుంజయ్, కృప, సార్థక్, అజయ్, ఎర్రం నవీన్, నిఖిల్, అరుణ్, సౌరవ్, అభిషేక్ ఝా, అభిషేక్ నందన్ పాల్గొన్నారు.