వికారాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ఉప సర్పంచులందరికీ వేతనం కల్పించాలి వికారాబాద్ జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. బుధవారం వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కి ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ చందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ కల్పించారని అందుకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామ అభివృద్ధి కోసం ఉప సర్పంచులు తమ వంతు కృషి చేస్తున్నారని, ఉప సర్పంచ్ లకు గౌరవ వేతనం అందించాలని అన్నారు.
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు చెందిన శంకుస్థాపన శిలాఫలకాల పైన ఉప సర్పంచ్ ల పేర్లు ఉండేలా చూడాలని కోరారు. గ్రామ పంచాయతీలో చేసే తీర్మానం ప్రతి దానిపై ఉప సర్పంచ్ ల సంతకం తీసుకోవాలని కోరారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశానికి ఉప సర్పంచ్ ల ను కూడా ఆహ్వానించాలని అన్నారు. గ్రామాలను సందర్శించి పనులను పరిశీలించిన సందర్భంలో ఉప సర్పంచులకు తప్పనిసరిగా సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామ పంచాయతీలో మహిళా సర్పంచులు ఉన్న స్థానంలో భర్తగానీ కొడుకులు గానీ పెత్తనం చేయకుండా అధికారులను ఆదేశించాలన్నారు.
ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఇందుకు సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా ఉపసర్పంచ్ ల సమస్యలన్నిటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఉప సర్పంచులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు పెద్దింటి నర్సింహులు, జిల్లా కోశాధికారి అజీమ్, ముని షా, గఫార్, వికారాబాద్ మండల అధ్యక్షుడు గొట్టి ముక్కుల మల్లేశం, ఉపాధ్యక్షులు సురేష్ ముదిరాజ్, హనుమంత్ రెడ్డి, రజిని బాబు, సద్దాం హుస్సేన్, జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం, ఉప సర్పంచ్ లు పాల్గొన్నారు.