సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలను విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
మూసి ఉండనున్న రహదారులు…
* తేలికపాటి మోటార్ వాహనాలకు నెహ్రూ ఔటర్ రింగు రోడ్డుపై అనుమతి లేదు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కేవలం ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే, వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
* కేవలం ఎయిర్‌పోర్ట్‌కు చెందిన వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై అనుమతి లేదు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఎయిర్ పోర్టు వాహనాలకు అనుమతి ఉంటుంది.
మూసి ఉండనున్న ఫ్లై ఓవర్ల వివరాలు…
* సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ 1, 2 ఫ్లై ఓవర్లు, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్‌టీయూ ఫ్లై ఓవర్లను మూసివేస్తారు.
* రోడ్ నంబర్ 45 దుర్గం చెరువు బ్రిడ్జి ఫ్లై ఓవర్ కూడా మూసి ఉంటుంది.
ప్రజలకు సూచనలు…
* ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాల్సి ఉంటుంది.
* క్యాబ్స్, ట్యాక్సీ, ఆటోరిక్షా డ్రైవర్లు అన్ని పత్రాలను కలిగి ఉండడంతోపాటు యూనిఫాం ధరించి ఉండాలి.
* ప్రజలు క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోలను పిలిస్తే తప్పనిసరిగా వారిని తీసుకెళ్లాలి. నిరాకరించారదు. నిరాకరిస్తే 1988 మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 178 ప్రకారం రూ.500 జరిమానా విధిస్తారు. ఇ-చలాన్ రూపంలో ఫైన్ వేస్తారు. ప్రజలు ఇలాంటి ఫిర్యాదులు ఉంటే 9490617346 అనే నంబర్‌కు వాట్సాప్ ద్వారా వాహనం నంబర్, టైమ్, ప్రదేశం వంటి వివరాలను పంపించి ఫిర్యాదులు చేయవచ్చు.
* డిసెంబర్ 31 అని చెప్పి ప్రజల నుంచి ఎక్కువ చార్జీలను క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోవాలాలు వసూలు చేయరాదు.
పబ్‌లు, బార్లు, కబ్బులకు సూచనలు…
* మద్యం మత్తులో వాహనాలను నడిపేందుకు బార్లు, పబ్‌లు, క్లబ్‌ల యాజమాన్యాలు వాహనదారులను అనుమతించరాదు. నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయి.
* మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయో బార్లు, పబ్‌లు, క్లబ్‌ల యాజమాన్యాలు కస్టమర్లకు వివరంగా చెప్పాలి. వాహనదారులు మద్యం మత్తులో వాహనం నడపాలని చూస్తే అడ్డుకోవాలి.
వాహనదారులకు సూచనలు…
* సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎప్పటికప్పుడు అన్ని రహదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తారు.
* పత్రాలను చూపించకపోతే వాహనాలను తాత్కాలికంగా పోలీసులు సేఫ్ కస్టడీలోకి తీసుకుంటారు.
* ట్రాఫిక్ పోలీసులు వాహనం ఆపి పత్రాలను చూపించాల్సిందిగా అడిగిన వెంటనే వాహనదారులు తమ పత్రాలను పోలీసులకు చూపించాలి. అలా చేయనిపక్షంలో వాహనదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతాయి.
* మైనర్లకు వాహనాలను ఇచ్చినా, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలను ఇచ్చినా వాహనాలను సీజ్ చేస్తారు. వాహన యజామనులపై చర్యలు తీసుకుంటారు.
* వాహనాలను పోలీసులు అనుకోని కారణాల వల్ల సీజ్ చేస్తే ప్రజలు తమ సొంతంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
* వాహనాల్లో అత్యధిక సౌండ్‌తో సంగీతం వినకూడదు. అలా చేస్తే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది.
* సరైన నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే ఆ వాహనాలను సీజ్ చేస్తారు.
* వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణించినా, వాహనాలపై ఎక్కి ప్రయాణించినా, రహదారులపై ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా న్యూసెన్స్ క్రియేట్ చేసినా.. అలాంటి వారిపై చర్యలు తీసుకోబడుతాయి.
* ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, అధికంగా హారన్ కొట్టడం, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వంటివి చేస్తే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల కింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
* ప్రజలు రహదారులపై వాహనాలను బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి.
మద్యం సేవించి వాహనాలను నడిపితే..
* మద్యం సేవించి వాహనాలను నడిపితే మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 సెక్షన్ 185 ప్రకారం కేసులు నమోదు చేయబడతాయి. నిందితులను కోర్టులో హాజరు పరుస్తారు.
* మొదటిసారి మద్యం సేవించి పట్టుబడితే రూ.10వేల వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారు.
* రెండో సారి మద్యం సేవించి పట్టుబడితే రూ.15వేలు జరిమానా లేదా 2 ఏళ్ల జైలు శిక్ష లేదా కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారు.
* మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. అదే రెండో సారి అయితే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తారు.
* మద్యం సేవించి యాక్సిడెంట్ చేస్తే.. అందుకు ఇతరులు చనిపోతే ఆ ప్రమాదాలకు కారణమయ్యే వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.