వికసిత్ భారత్‌లో మేధావుల పాత్ర కీలకం: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జూన్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని దివ్యశక్తి రెసిడెన్సీ అపార్ట్మెంట్‌లో నివాసితులతో నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ ఇన్‌చార్జి ర‌వికుమార్ యాద‌వ్ పాల్గొన్నారు. అపార్ట్మెంట్ వాసుల ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, దేశ అభివృద్ధి, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మేధావులు, విద్యావంతులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతమైన దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా, స్టార్ట్‌అప్ ఇండియా, స్టాండ్‌అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అమృత్ 2.0, స్వచ్ఛ భారత్, ఫిట్ ఇండియా వంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు, చదువుకున్న యువత సమర్థంగా వినియోగించుకుంటే భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఈ సందర్భంగా శేరిలింగంపల్లి బీజేపీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయడం సహజమే అయినప్పటికీ అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అపార్ట్మెంట్ వాసులు ప్రస్తావించిన రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యలు, క్లబ్‌హౌస్ సమస్యలు, కబ్జాలు తదితర అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతు కొనసాగుతున్నట్లే రాష్ట్రం, డివిజన్, బూత్ స్థాయిలో కూడా పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజల సూచనలు, సహకారం, ఆశీర్వాదాలతో మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో దివ్యశక్తి రెసిడెన్సీ నివాసితులు, అసోసియేషన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్‌తోపాటు మహేష్, మాణిక్‌రావు, సీతారామరాజు, పట్టాభిరామ్, గణేష్, శ్రీను, విజయేందర్, ప్రసాద్, శ్రీనివాస్, రాము, రవీందర్ నాయక్, నాగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here