నల్లగండ్లలో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 42 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొలుకుల విజయ్ కుమార్ (42) స్వయం ఉపాధి చేసుకుంటూ తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ఈ నెల 21న రాత్రి సుమారు 7 గంటలకు TS11EL6398 నంబర్ స్కూటర్‌పై విజయ్ కుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 22న అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో విజయ్ కుమార్ మొబైల్ నంబర్ నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. నల్లగండ్ల ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డులో గాయత్రి క్లాసిక్ అపార్ట్‌మెంట్స్ సమీపంలో విజయ్ కుమార్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం ఇచ్చారు.

మృతుడు కొలుకుల విజయ్ కుమార్ (ఫైల్)

వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగా, అప్పటికే 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. ప్రమాదం జరిగిన తీరుపై అక్కడున్న వారిని విచారించగా.. చీకటి కారణంగా రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను గమనించలేక స్కూటర్‌పై నియంత్రణ కోల్పోయి విజయ్ కుమార్ కిందపడినట్లు తెలిపారు. ఈ ఘటనలో అత‌ని తలకు, అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలయ్యాయి. విజయ్ కుమార్‌ను తొలుత లింగంపల్లిలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 23న మధ్యాహ్నం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కొలుకుల విజయ్ కుమార్

అక్కడ చికిత్స పొందుతున్న అత‌ను బుధవారం (ఆగస్టు 26) ఉదయం సుమారు 6.48 గంటలకు మెదడులో రక్తం గడ్డకట్టడం కారణంగా మృతి చెందినట్లు డ్యూటీ వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. తన కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానం లేదని, రోడ్డు ప్రమాదంలో గాయాల కారణంగానే మృతి చెందినట్లు భావిస్తున్నానని మృతుడి తల్లి చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here